30, నవంబర్ 2017, గురువారం

వికృత మనస్సు

ఒకొక్క మారు మనుషుల మనస్తత్వాలు చూస్తే అసహ్యం, భయం తో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంది...
మనం ఇంకా అనాగరికులమా ,
ఏ యుగంలో ఉన్నాం
అనే అనుమానం కూడ
రాక మానదు..
ఆడ అయిన, మగ అయిన వేసుకునే వస్త్ర ధారణ బట్టి కారెక్టర్ ని అంచనా వెయ్యడం ఎంతవరకు సమంజసం...
ముఖ్యంగా ఆడ వాళ్ల పట్ల..
traditional డ్రెస్ వేస్తే మంచివాళ్ళు లేదా characterless అని ముద్ర వేసేస్తారు...
వళ్ళంతా కనిపించేటట్టు వేసుకుంటే అది వేరే విషయం..
ఒక వయసు వచ్చాక traditional saree తప్ప ఇంకేది వేసుకున్న విపరీత ధోరణిలో కామెంట్స్..
వస్త్ర ధారణ అనేది వాళ్ల, వాళ్ళ కంఫర్ట్ బట్టి ఉంటుంది..దాని మీద ఎవరికి కామెంట్స్ చేసే అధికారం ఏ రాజ్యాంగ చట్టంలోని లేదు..
ఒక్క వస్త్రధారణ అనుకుంటే పొరపాటే...అన్నిటిలో ఆక్టివ్ గా participate చేసి అందరితో కలుపుగోరుగా మాట్లాడిన వాళ్ళు characterless కిందే లెఖ్ఖ ..
బాధ కలిగేది ఎప్పుడంటే..
ఇలా కామెంట్స్ చేసేవాళ్ళలో
చాలా మంది సో called పెద్ద మనుషులు ఇంకా
educated వాళ్ళు కూడా ఉండడం చాలా శోచనీయం..
అన్ని చూసాక ఒకటి అర్ధం అయింది చదువుకు మనిషి౼ సంస్కారానికి అసలు పొంతనే లేదు..
అందుకే పెద్ద వాళ్ళు ఊరికే అనలేదు "చదువుకున్న వాడి కంటే చాకలాడు నయం" అని..
ఓ మనిషి !
సొసైటీ లో నువ్వు ఏ position లో ఉంటే నాకేంటి
నీ సాటి మనిషిని అర్ధం చేస్కోనప్పుడు, అనుచిత వాక్యాలు చేసినపుడు నువ్వు ఎంత ఎదిగిన నేల మీద పరిచే గడ్డి పోచతో సమానం...
నీ మీద నువ్వు సిగ్గుపడు,
నీకు సంకుచిత ఆలోచనలు కలిగినందుకు మధనపడు..
లోపం నీలో ఉందని తెలుసుకో..
అర్ధమున్న మనిషిగా మసలుకో
నీ మాటకు ఒక అర్ధం తెలుపు..
మసకబారిన కళ్ళతో కాదు.. మనసుతో చూడు లోకాన్ని..
ఓ మనిషి !
నీలో వివేకాన్ని మేలుకొలుపు..
రేణుక సుసర్ల

26, సెప్టెంబర్ 2017, మంగళవారం

అవును నేను తేడానే

అవును నేను తేడానే...
మనుషుల్లో
మమతానురాగాలు
వెతుక్కునే 
మనసు నాది..
ప్రతి వాళ్ళు నా వాళ్లు
అనుకునే
మమత నాది...
అందరూ
నా ఇంటికి వచ్చి
నా ఆతిధ్యం
స్వీకరించాలి అనుకునే
తపన నాది...
మనీ కంటే
మనసు గొప్పది..
అహంకారం కంటే
ఆత్మీయత గొప్పది...
ప్రతి దానికి
పంతం కంటే
నలుగురిలో సద్దుకునే
గుణం గొప్పది...
మనుషులు,
మమతలు
కావలనుకోవడం
తప్పంటే
అవును నేను తేడానే...
అవును తేడానే😧
రేణుక సుసర్ల
శుభోదయం

ఉత్తరాలు

చెదురు మెదురుగా ఉన్న పుస్తకాలని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో
వన్నెలు దిద్దుతూ ఉంటే పుస్తకాల మాటు దాగి ఉన్న ఉత్తరాలు దోసిట్లో
లంకె బిందెల్లా దొర్లి పడ్డాయి...
అన్ని తత్తరపాటుతో 
చదివిన నాకు
ఒక్కసారి కన్నీళ్లు
నా జ్ఞ్యాపకాలను తడిమాయి...
ఎన్ని అనుబంధాలను పోగేసుకున్నాయో
ఈ ఉత్తరాలు...
ఒకప్పుడు దూరాలను కరిగించి అనుబంధాలను దగ్గర చేసినవి ఈ ఉత్తరాలే...
క్లుప్తంగా కుసలప్రశ్నలేసే పోస్టుకార్డు..
గుంభనంగా కనిపించే
ఇన్లాండ్
పేరుపేరునా కాగితాలు పేర్చడానికి
envelop లు
కొత్త కొత్త పులకింలు గొలిపే గ్రీటింగ్ కార్డ్స్...
ఎన్నో ఎనెన్నో ఊహకు ఒకటి
సమయానుకూలంగా...
అమ్మకు రాసిన ఆత్మీయ లేఖ
మనసుతో మగనికి రాసిన మానస లేఖ..
ప్రేయసికో, ప్రియునికో రాసిన ప్రేమ లేఖ...
కలం స్నేహం పేరుతో
పరిచయ లేఖ...
పుట్టుక నుండి చావు వరకు
పేరు పేరు కో లేఖ...
లోకాన్నే మైమరచి మాటి మాటికి చదువుతూ...
నెమరువేసుకున్న తీపిగుర్తులేన్నో ఆనాడు...
వరుసకు కూడా కానరాని కనుమరుగయ్యే ఈ నాడు...
ఒక్క మారు ఆ రోజులు తిరిగివస్తే ఎంత బాగుణ్ణు...
అని గుర్తువచ్చినప్పుడల్లా
ఆప్యాయంగా నా ఉత్తరాలని తడుముతూ...ఇంకొక్కసారి చదువుతూ నన్ను నేను మైమరచిపోతా....😔
రేణుక సుసర్ల

మనసు మనవి

ముక్కు పచ్చరాలని
అపరంజి బొమ్మ ..
జరుగుతున్నది ఎందుకో
ఏంటో తెలియని వయస్సు...
రోజు ఆడే ఆటల్లో, పాటల్లో ఇది ఒక ఆటే అనుకొనే మనస్సు...
కానీ పెద్దల మూర్ఖత్వం, ఆచారాల పేరుతో తనతో ఆడుతున్న బతుకు బూడిద
అనే ఆట అని
అర్ధం కాని అయోమయ పరిస్థితి..
అయినా కంటికి రెప్పలా కాపాడే అమ్మ, నాన్న ఉండగా నాకెందుకీ చింత...
అనుకుంది పాపం చిట్టి తల్లి...
తన భవిషత్తునే కాలంధకారంలో
నెట్టే వాళ్ల తొలి ప్రయత్నం అని తెలుసుకునే వయసు కాదు..
మనసు లేదు...
తన బాల్యాన్ని త్రుంచే సమయం ఆసన్న మైందని తెలీదు ఆ పసిదానికి...
ఏ మనసున్న మనిషి అయినా అంగీకరించని తరుణం..
మనసున్న ప్రతి ఒక్కరు స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి అని నా చిన్ని మనవి...
రేణుక సుసర్ల

పడమటి కనుమలు

నల్లని మేఘాలు
తమ వన్నెల దుప్పటి...
నేలంతా పరుస్తూ ఉంటే...
పచ్చని ఆకులతో తమ
మేనంత కప్పుకొని 
యవ్వనాన్ని దాచిన
హిమగిరి సొగసులు ...
తమ అందాలని ..
కని కనిపించనట్టు చూపిస్తూ..
సిగ్గు పడుతూ ఉంటే..
ఆ ఆనందమే వేరు...
స్వర్గం భూమి మీద
నెలకొందా లేదా..
ప్రకృతి అందాలు
పరవళ్లు తొక్కి
చూపరులను ఇంత
ఆహ్లాదింప చేస్తున్నాదో తెలియదు కాని..
మనల్ని మనం
మైమరిచే అంత అందాలు
ఆ పడమటి కనుమలవి...

బతుకు పుస్తకం

బతుకు పుస్తకంలో
రోజుకొక పేజీ..
చదువుతున్న ప్రతి రోజు
ఏదో తెలీని
మనసుకి ఆతృత, 
తరువాత పేజీలో
ఏముందో
తెలుసుకోవాలనే
కుతూహలం...
చదువుతున్న పేజీ
సారాంశం
తెలుసుకునే లోపే
కొత్త ప్రశ్నలు,
అర్థంలేని ఊహలు..
ఎన్నో చెయ్యాలి
అన్న తపన...
చదివిన ప్రతిసారి
తరువాయి పేజీలో
ఏముందో చింతే తప్ప..
చదువుతున్న పేజీలో
ఏకాగ్రత ఉండదు...
ఆరాటం ఉన్న
లక్ష్యసాధన
ఉంటే కానీ
చివరి పేజీ కి చేరలేము...
చేరిన అది అర్ధహీనతే అవుతుంది...
రేణుక సుసర్ల...

నీ నేస్తం

ప్రియాతి ప్రియమైన నేస్తమా...
నా జీవితంలో ఏదో ఒకరోజు నీతో నా మనసులో రేగే అలజడుల కెరటాలని పంచుకుందా మనుకున్నా...
కానీ నిన్ను చూడగానే మళ్ళా అదే బిడియం అదే తెలీని భయం...వల్ల
మనసున దాగిన మాటలు, ఊసులు మూగబోయి...
నా అంతరంగాన్న కలలా మిగిలిపోయాయి..
ఈ రోజు ఎలాగో మనసు నిబ్బరం చేసుకొని రాస్తున్న
నా యదలోని భావాలు...
కాలేజి రోజుల్లో నిన్ను చూడని రోజంటు లేదు తలవని క్షణమంటూ లేదు...
నీకు కూడా నా మీద
అదే భావన అనుకున్నా...
ఏ రోజైన నువ్వు నీ మనసులో మాట నాతో చెప్తావని వేచి చూడని ఘడియంటూ లేదు...
రోజులు గడిచాయి..
అంకెలు మారాయి కానీ
నీ మనసులో మాట నా దరి చేరలేదు...
నా మటుకు నేను నీకు తెలియచేద్దా మన్నా ఏదో సంకోచం నువ్వు కాదంటే...
భరించలేని ఆవేదన ఎదురవుతుంది అని లోలోపలే పూట పూటకి ఎన్ని పురిటినొప్పులు అనుభవించానో తెలీదు నేస్తమా!
నీకు నా ప్రేమని తెలపలేక ఇంకోళ్ళకి చేరువ అవ్వలేక..
ఒడ్డు తెలియని నా జీవితపు కడలిలో ఈదలేక..😔
ఒంటరిగానే ఈ విరహాపు గరాళాన్ని దిగమింగుతున్నా..
మనం ఎప్పటికి కలవని రైలుపట్టాలమని తెలుసు..
కానీ నన్ను నేను మభ్యపెట్టుకోలేక
నా మనసులో ప్రేమని చంపుకోలేక, నన్ను నేను వంచించుకోలేక...ఒక్కమారు అయిన నా భావలని నీకు తెలియజేయాలని
నా చిన్ని ఆశ
నా చేత
ఈ ఉత్తరం..రాయించింది..
నా జీవితపు పుస్తకంలో ప్రతి అక్షరం నీకోసం రాసే నేను...చివరికి ఇలా అర్ధంకాని సంతకంలా మిగిలిపోతా అని తెలియలేదు...
తెలీక నీ మనసు బాధ పెడితే క్షమించు నేస్తమా...
ఎప్పటికి నీకు చేరువవ్వని
నీ నేస్తం...😔
రేణుక సుసర్ల

సాహిత్య వనం

నీ చూపుల హరివిల్లులో నేను వదిగిపోనా
నీ వలపుల గాలంలో
చిక్కుకుపోనా
నీ మనసు పాడే రాగంలో నే పల్లవి అవుతా
నీ ప్రేమ లాహిరిలో పరవశించిపోనా.
నీ చేతి కుంచెలో ఒక చిత్రాన్ని అవుతా..
నీ రంగుల ప్రపంచంలో
వదిగిపోనా..
నీ ఊహల ఉలితో ఒక శిల్పాన్ని అవుతా..
నీ కళల లోకంలో విహరించనా...
నీ హృదయంలో నే ఒక భావరేణువు అవుతా..
నీ సాహిత్య వనంలో
కావ్యమైపోనా...
రేణుక సుసర్ల

కవిత్వం

స్వప్నం లోంచి పుట్టిన కవిత్వం
మనసులను వూహింప చేస్తుంది !
జీవితం నేర్పిన కవిత్వం
అలసిన మనసులను వూరడిస్తుంది !
మనలో ఏర్పడే
ప్రతి స్పందన
గుండెలోతుల్లోంచి..
మనసుకి వినిపించినపుడు
ఒక భావోద్వేగం
పుడుతుంది...
ఆ భావోద్వేగం
అక్షర రూపం దాలుస్తే
మహా కావ్యం అవుతుంది...
కేవలం
స్పందించే హృదయం
మన భావాన్ని
వ్యక్తపరిచే
ఉత్సాహం ఉంటే చాలు
ప్రతి మనసుని కదిలించే
ఒక మహా సంగ్రామం
అవుతుంది
మౌనం కూడా భాష
కురిపిస్తుంది
మూగబోయిన
మనసు కూడా
మాటలు చెపుతుంది...
కాలం సహకరించాలి..
వ్యక్తపరచడానికి
సరి అయిన
సమయం రావాలి
అంతే..
రేణుక సుసర్ల

కల్పన

కలల
మబ్బుల చాటున...
నీ ఉనికి కూడా
ఒక కల్పనేన..
మరి నా హృదయ స్పందన..?
ఒక భ్రమా ..
ఏదో తెలీని అనిశ్చిత..
ప్రతి ఉదయం
ఒకే ఊహ
ఒకే కోరిక
ఒకే గమ్యం...
నీ ఉనికి నిజమే అని..
నీ ప్రేమ కల కాదని
నీ దరి చేరడమే
నా లక్ష్యం అని...
రేణుక సుసర్ల

బాల్యం

నా పసితనపు
పసిమి ఛాయలు
చిగుర్చిన...తరుణంలోనే తుంచివేయబడ్డాయి..
విధి ఆడిన
వింత నాటకంలో...
గతిలేని పాత్రను అయ్యాను...
ఆడే పాడే వయస్సులో
ఇంటికి ఆధారం అయ్యాను...
పుస్తకాలు మోసే వయస్సులో..
పని భారాన్ని మోస్తున్నాను...
నా బాల్యాన్ని హరించిన
విధిని వంచించాల
లేదా..
బాధ్యతలేని అమ్మ ,నాన్నలని
నిందించాలో తెలీదు
కానీ...
ముళ్ళకంచెల్లాంటి బంధాలకు
బలి పశువునయ్యా...
ఆదరణ కరువైన
అనాధ నయ్యా..
ఏ పాపము ఎరుగని
నాకు ఈ శిక్ష ఏల?
ఇంకా వికసించక ముందే
నా బాల్యాన్ని తుంచడం న్యాయమా...?
ఇది నా దౌర్భాగ్యమా...?
నాకు వేరే దారే లేదా😔
రేణుక సుసర్ల

లెఖ్ఖ

సముద్రంలో ఎన్ని
అలలు వచ్చిన
ఈదే చేపకు ఒక లెఖ్ఖ
ఆకాశం ఎంత ఎత్తున
ఉన్న 
ఎగిరే పక్షికి ఒక లెఖ్ఖ
జీవితంలో
ఎన్ని వడిదుడుకులు
వచ్చిన కష్టించే
మనసుకి ఒక లెఖ్ఖ...
శుభోదయం

ఎప్పుడో

చేరువైన మనసులు తీరం చేరేదెప్పుడో..
భారమైన బంధాలు తేలికైన దెప్పుడో..
శిశిరమైన మనసులో 
వసంతాలు చిగుర్చే దెప్పుడో...

తడి ఆరని తపనలు తలుపు తట్టేదెప్పుడో..
క్షణాలు యుగాలుగా మారిన
నా ఈ నిరీక్షణకు ముగింపు ఎప్పుడో...
ఎప్పుడో ఇంకెప్పుడో...

కలం

రాజకీయం మరోమారు
కసాయి దారంతో నేసిన..
రక్తపుబట్ట కప్పుకుంది...
ఎదిరించిన
కలం గుండెని
అహంకారపు
తూటాతో
కూల్చేసింది...

నేల కొరిగింది ఒక
చైతన్యపు బొట్టు..
నేల రాలుతూ
ఎందరో గుండెల్లో
ఆలోచన చిచ్చు రగిల్చింది..
నిరసనగా వేల నోర్లు గళం విప్పాయి...
కానీ ఈ జ్వాల ఎంతసేపు వెలుగుతుంది...
చితి ఆరెవరకు..
లేదా
మనలో ఉక్రోషం
ఊపు ఉన్నంత వరకూ..
నిజంగా మార్పు
రావాలోయి...
ఎంతకాలం ఇలా...
గొర్రెల్ల, మేకల్లా..
రాజకీయ నాయకుల
ఆగడాలకు తలవంచుతూ..
రోషం, పౌరుషం ఎక్కడ దాచిపెట్టవోయ్...
ఎంత సేపు కాయకష్టం చేసే కూలి,నాలి దగ్గరేన
నీ నోరు, ఆక్రోషం..
మనల్ని నిలువెల్లా దోచుకుంటున్న
ఈ క్రూర రాజకీయనాయకుల దగ్గర ఏమయ్యింది..?
అన్యాయాన్ని ఎదిరించడం..
కలం చేత పట్టే
వాడిదే కాదోయ్..
కసి ఉన్న
ప్రతి హృదయానిది..
ఎన్నాళ్లు ఎన్నేళ్ళు..
రండి రండి కదలి రండి
మండే గుండెతో..
ఆవేశమనే ఖడ్గంతో..
మీ ఓటు అనే
ఆయుధంతో నరకండి
కసాయి రాజకీయాన్ని..
రేణుక సుసర్ల

ఆట

బంధాలు
బరువైనప్పుడు
మనసు భారం
దించుకోవాలని
ఎవరికి ఉండదు...
కానీ బాధ అనే
గరాళాన్ని
దిగమింగేస్తూ..
నవ్వుతూ బతికేస్తాం..
ఆప్తులైన వాళ్ళతో పంచుకుందామన్న
తెలియని బిడియం, మొహమాటం..
గొంతు అంచునే
మాటని బయటకు
రానీయ కుండా
నొక్కేస్తాం
హృదయం బరువై..
కన్నీటి తలుపులు
తడితే
ఎవరికి కానరాకుండా...
లోలోపలే
మేఘనాద్రుడి లా
గుంభనంగా
దాచుకుంటాం..
ఈ జీవితపు రహదారిలో
రోజూ అర్ధంకాని
ప్రశ్నలెన్నో..
విప్పలేని
చిక్కుముడులెన్నో..
దేముడు ఆడించిన
జీవన రంగస్థల
మైదానంలో
గెలిచిన, ఓడిన..
ఆట చివరివరకు
ఆడ వల్సిందే...
రేణుక సుసర్ల

ఆకలి...

జీవితానికి అర్ధం 
తెలిపేది ఆకలి..
ఎంత గొప్పవాడైన
ఆకలి ముందు
చేయి చాచాల్సిందే..
సుతిమెత్తనైన
హృదయాన్ని కూడా
గాయపరిచేది
ఆకలి ...

భ్రహ్మాండం బద్దలైనట్టు..
అగ్ని గోళం నుండి
లావా ఉబికినట్టు...
అర్ధరాత్రి
కసాయి నిద్రలో
మెదడులో
అడవిజంతువులు
అరిచినట్టు...
బిల బిల మని
కడుపులో
ఆకలి అరుపుల
పొలికేకలు...
గుండెలు పిండే
మండే జ్వాల
ఆకలి..
కన్నతల్లిని కూడా
కసాయి దాన్ని చేసే
తల్లుల ఆకలి..
పూటకూటికై
శీలం అమ్మే
అతివల ఆకలి..
పిడికెడు అన్నం కోసం
అవయవాలను అమ్మే
అభాగ్యుడి ఆకలి...
చూసావా ఎప్పుడైనా
ఎంగిలి ఆకులపై
ఆకలి కోసం
ప్రేతాల పోరు..
విన్నావా ఏ రోజైనా
బరువెక్కిన గాలిలో
ఆకలితో మరణించిన
ఆత్మల రోదన..
మాకెందుకు?
మీ వైభవ సౌధాల జోరు
వినండి మా ఆకలి హోరు
ఎండిన మా డొక్కల పోరు
రేణుక సుసర్ల

కన్నీరు

అంత కన్నీటిని ఎంత
గుంభనంగా దాచాడో
మేఘనాద్రుడు...
ప్రేమగా పలకరిస్తే 
కన్నీటి వానని
ఇట్టే కురిపిస్తాడేమో...
రేణుక సుసర్ల

నిశ్శబ్ధం...

కావాలి నాకిపుడు
మనసు కోరే నిశ్శబ్ధం...
కనురెప్పలు కూడా
కదలాడిన
కానరాని నిశ్శబ్ధం..
హృదయ ఘోష
వినిపించని మనసుకి
తెలియని నిశ్శబ్ధం..
శ్వాస కూడా
తెలియలేని
నన్ను నేను
మైమరిచే నిశ్శబ్ధం..
చిక్కదనపు
చీకటి నుండి
భ్రమగోలిపే
వెలుగు లాంటి..
శాశ్వత మగు
నిశ్శబ్ధం
కావాలి
ఒకటి నాకు...
రేణుక సుసర్ల

ఆరాటం

పరుగెడుతున్న
కాలంతో
పోటీ పడలేకపోతున్న..
వద్దనుకున్న
మనసులో రేగే 
ఆలోచనలను
ఆపలేకపోతున్న..
కన్నీటిని
రెప్పల వెనుక
దాచేసి
బూటకపు నవ్వు
నవ్వలేకపోతున్న...
బరువెక్కిన
బంధాలని
తెంచుకోలేకపోతున్న..
మనసులో రేగే
అలజడుల కెరటాలని
గొంతు విప్పి
చెప్పలేకపోతున్న...
ముళ్ళకంచెలని
తెలిసి కూడా
ఇంకా ఎక్కడో
బంధాలు నిలపాలని
ఒకే ఒక్క ఆరాటం,
తపన నన్ను నడిపిస్తోంది...
రేణుక సుసర్ల

నీతోనే

కురిసే వాన చినుకు నీవైతే...
కదిలే కాగితం పడవ నేనవుతా..
నీతోనే నా పయనం..
ఎగసే అలల కెరటం నీవైతే
తడిసే ఇసుక రేణువు నేనవుతా..
నీతోనే నా గమ్యం..
మెరిసే చంద్రుడు నీవైతే
మురిపించే తారకని నేనవుతా..
నీతోనే నా వెలుగు...
విరిసే పూరెమ్మ నీవైతే...
పరిమళించే సువాసన నేనవుతా...
నీతోనే నా ఉనికి...
మురిసే సఖుడివి నీవైతే..
ప్రేమించే సఖిని నేనవుతా..
నీతోనే నా జీవితం...
రేణుక సుసర్ల

23, ఆగస్టు 2017, బుధవారం

నువ్వుంటే చాలు..

నాకు ఎవరు వద్దు ...
నన్ను నన్నుగా 
అర్ధంచేసుకున్న 
నువ్వుంటే చాలు..
నా నవ్వులో 
నీ ఆనందం చూసుకునే
నువ్వుంటే చాలు..
అనుక్షణం నన్ను కంటికి
రెప్పలా కాపాడే
నువ్వుంటే చాలు..
నా కోసం అనుక్షణం
ఆలోచించే
నువ్వుంటే చాలు...
అవును నేస్తమా
ఆ నువ్వు
నీవు అయితే చాలు😊

మనసు... మలుపులు

సాగిపోయే
అనుభవాల కాలానికి
నేర్చుకున్న పాఠాలు ఆనకట్టలేమో...
అయినా ఇంకా
ఎక్కడో చెరిగిపోని 
జ్ఞాపకాల ముళ్ళు
మనసుని గుచ్చుతూనే ఉంటాయి...

కిందపడిన ప్రతిసారి
వెనక్కి పొమ్మని
నాలో ఆత్మాభిమానం
ఆలోచించిన
ముందుకే సాగిపొమ్మని
మనసు
పిలుపు ఇచ్చింది...
నా జీవన
రహదారిలో
ఇంకా అర్ధంకాని
మలుపులు ఎన్నో,
తీరం లేని దారులెన్నో
లెక్క తెలియని
ఎన్ని బంధాల
మైళ్ళు రాళ్లు దాటాలో...
ఒక పరిపూర్ణమైన
మనసుతో
ఒక మంచి దృష్టితో...
ఒక కొత్త
ఉషోదయానికి
స్వాగతం పలుకుతూ...
ప్రతి రోజు
ఒక కొత్త అధ్యాయం
తిరగేస్తూ...
రేణుక సుసర్ల

తీరని దాహం..

గుండె గోడలపై
గతం సిరాతో
నీ జ్ఞాపకాలు
కధలు కథలుగా
రాస్తున్న ...
ఇంకా ఈ మనసుకి
తీరని దాహం..
ఎంత కసి ఈ ప్రేమకి..
నీ తలపుల తడితో
హృదయం
ఎంత బరువెక్కిందో
తెలుసా నేస్తమా..
నువ్వు కనిపించని
ఒక అభూత
కల్పనవని
తెలిసి కూడా
ఆరటంగా
నిరీక్షణ జాగరాలు
ఎన్నెన్నో...
నీ ఊహల్లో కూడా
ఎంత ఆనందం
అనుభవిస్తుందో
ఈ మనసు...
నీ ఉసుల అలలతో
నీ అనే తీరం
చేరేదెప్పుడో
ఈ చెలి...
నీ దరికి చేరిన
లేకపోయినా
నీ ఆలోచనల పూతోటలో
ప్రతి క్షణం
నీ కోసం వికసించే
పుష్పాన్ని నేను..
రేణుక సుసర్ల

16, ఆగస్టు 2017, బుధవారం

తప్పు కాదా

నువ్వు చేసింది తప్పు కాదా?
ప్రాణానికి తెగించావు
పేగులు తెగేలా
పురిటి నొప్పులు 
పడి కన్నావు...
నువ్వు పస్తులు ఉండి
వాడి కడుపు నింపేవు..
ఆకలి విలువ
తెలీకుండా చేసేవు..
పుస్తులు అమ్మావు..
కావలసినవి సమకూర్చావు...
కష్టం తెలీకుండా పెంచేవు..

నువ్వు చేసింది తప్పు కాదా..
కాయా, కష్టం చేసేవు..
రక్త, మాంసాలు పణంగా
పెట్టి చదివించావు...
బాధ్యతలు మోపకుండా
పెంచావు...
ఏమైంది కృశించి,
క్షీణించి రోడ్ మీద పడ్డావు..
చెట్టు నీడే నీ వాసం,
దారినపోయే బాటసారులే
నీ నేస్తాలు..
ఒకరి దయే నీ ఆకలి తీర్చేది..
నువ్వు చేసింది తప్పు కాదా?
శరీరం పట్టు తప్పిన
జీవం దేహాన్ని వీడదుగా..
ఇంకా ఎంత నరకం చూడలో..
నువ్వు చేసింది తప్పే మరి ముమ్మాటికీ తప్పే..
ఈ పాపం ఎవరిది..
కన్న వాళ్ళది కాదా?
ఒరే నీ జీవితం ఇంత కన్నా దుర్భరం కావచ్చురా..
కన్న వాళ్ళని క్షోభ పెట్టొద్దురా...
రేణుక సుసర్ల

బంధాల బలం..

సుతి మెత్తగా భుజం మీద
తల ఆన్చి
తన చెంపలు తడి
అయినప్పుడు తెలిసింది
బంధాల బలం..
నిజమే కదా ఇరవై మూడేళ్లు కనిపెంచిన వాళ్ళని
ఒక్క రోజులో ఏమి కానట్టు
వదిలేసి రావడం అంటే
ఆ మనసుకి ఎంత కష్టం..

నాకు తను దగ్గరైందన్న
సంతోషం కంటే
తన వాళ్ల నుండి దూరం చేస్తున్నాను అనే బాధ
ఎక్కువై
మనసు బరువెక్కింది..

బాధ్యత పెరిగింది..
బంధం గట్టి పడింది..
ఆప్యాయంగా గుండెకు
తనని హత్తుకొని
నేనున్నా అన్న భరోసా ఇవ్వాలనిపించింది...
సుఖ, దుఃఖాల్లో
నేను సైతం
నీ వెంటే ఉంటా
అన్న ధైర్యం
నింపాలనిపించింది...

కష్టాలన్నీ
కన్నీళ్లతో కడిగేద్దాం..
ఊహాలన్ని
నిజాలు చేద్దాం..
కష్టమో సుఖమో
బతికేద్దాం..
ఓపికనే ముసుగులో
కాలంతో పోరాడుదాం..
ఇంకా చేతకాకపోతే
ఇద్దరం కలిసి
ఓకేమారు మన
శ్వాసలని ఆపేద్దాం...
మనిద్దరి మధ్య బంధం
ఎంత గట్టిదో
లోకానికి చూపుదాం...

అని
తన కళ్ల లోకి చూస్తూ
అనుకున్న
ఇంకా తన తల
నా భుజం మీద
తడి ఆరని కళ్ళతో వాలే ఉన్నాయి..
తన చేతులు
నా చేతుల్ని
గట్టిగా పట్టుకునే ఉన్నాయి..
నువ్వు ఉన్నావు అనే
నా నమ్మకం
అని చెప్పినట్టు...

రేణుక సుసర్ల



తెల్ల కాగితాలు

గాలికి రెప రెప 
లాడుతూ
తెల్ల కాగితాలు 
నన్ను చూసి 
పలకరింపుగా నవ్వాయి..

నా గురించి
ఏమైనా రాస్తావా
అని అడిగాయి..
సరే మొదటి పేజీ
నీకే ఇచ్చేస్తా అన్నాను..
ఇంతకీ ఈ రోజు
నా పరచిన మనసుపై
నీ భావాక్షరాలు
ఎలా పేరుస్తావు
అని అడిగింది
ఖాళీ కాగితం..

ఏముంది
నా మనసుకి
పట్టిన చెమట
అక్షర రూపంలో పేర్చి
నీ మీద అర్ధంకాని
మరకలుగా
మిగిలిపోతా అన్నాను..
అవును మరి
అవి కన్నీటి చుక్కలని
తెలియ కూడదుగా
అంది కాగితం...

అవును నీకు తప్ప
ఎవరికి చెప్పలేను కదా..
ఒంటరిగా ఉన్నప్పుడల్లా
నువ్వే గా నా నేస్తానివి..
అని కృతజ్ఞతతో..
నిమిరాను
తెల్ల కాగితాలని..

రేణుక సుసర్ల

ఒక్క క్షణం

నిజం నేస్తమా
ఒక్క క్షణం నీ సమక్షం
ఎంత ఆనందం ఇస్తుందో
నన్ను నేను
మరిచిపోయినంత..
ఒక్కమారు
నీ ఆప్యాయత
ఎంత ధైర్యాన్ని ఇస్తుందో..
ప్రపంచం గెలిచినంత..
ఒక్క క్షణం నీ తలపు
ఎంత ఉత్తేజాన్ని ఇస్తుందో
రెక్కలు కట్టుకుని
నీ ఎదురుగా వాలిపోదాం
అనిపించినంత..
మనసు బరువెక్కిన
ప్రతీ మారు
నువ్వు ఉన్నావనే
నా నమ్మకం
ఎంత ఊరట
కలిగిస్తుందో నేస్తమా...
రేణుక సుసర్ల

మనిషి...మనస్సు

నీ
మనసింతే..
ఎదురుగా ఏది చెప్పలేదు
తన్ని తాను
నొప్పించుకుంటుంది కానీ..
ఎదుటి మనసును
గాయపరచలేదు..
ఎన్ని మార్లు
నా మనస్సు మీద
అలిగానో, కసురుకున్నానో
నువ్వు ఇక మారవ?
అడిగింది
నాలో మనిషి..
నీ కోసం నువ్వు
ఎప్పుడు ఆలోచిస్తావు..
ప్రతి మారు
ఇంతేనా?
మధన పడినప్పుడల్లా..
నన్ను పిలుస్తావు..
చూడు రేపటి నుండి
నాకు నచ్చినట్టే ఉంటా..
గట్టిగా ప్రతిజ్ఞ చేసుకుంది..
మనస్సు..
మళ్ళా ఒక పక్క
అనుమానం
ఇది స్వార్ధం కాదా..
అని నన్ను అడిగింది..
ఇలా సమాధానం లేని
ప్రశ్నల మధ్య
ఎన్ని మార్లు
పురిటినొప్పులు
అనుభవించిందో..
రోజుకో పోరాటం
మనిషికి,
మనసుకి మధ్య..
ఏది ఏమైనా
చివరికి గెలిచేది
నువ్వేగా అని నాలో
మనిషి నిట్టూర్చింది...
రేణుక సుసర్ల

మౌనం

ఒక్క క్షణం 
నిశ్శబ్ధం లోను 
వింత సడి..
మౌనం లోను 
రవ్వంత తడి..
ఏదో తెలీని
ఒంటరితనం కోరుకుంటుంది..

నీలో నువ్వే
మాట్లాడుతూ,
ఓదారుస్తూ..
దూరంగా ఒంటరిగా
కొండల మధ్య గట్టిగా
అరవాలనిపిస్తుంది..
మన ప్రతిధ్వని
మనకే సమాధానం
ఇచ్చినట్టుగా..
ఏదో తెలీని హాయి..
మన స్పర్శ
మనకి గోముగా..
మనసు తేలికగా
ఉంటుంది..

ఇంకో క్షణం
చిన్న పలకరింపుకు
మనసు
ఆరాటపడుతుంది..
యుగాలనాటి
భావోదగ్వేదాల్ని
పంచుకోవలనిపిస్తుంది...
ఓదార్పు ఇచ్చిన
వారి గుండెల్లో
ముఖం దాచుకొని
తనివితీరా
ఏడవలనిపిస్తుంది...

ప్రతిధ్వనిస్తుంది
నీలో ఒక
వినూత్న బాణి...
విరహాపు పూబోణీ..

రేణుక సుసర్ల

నా ఈ మనసు

మాటలు కరువై,
మనసు బరువై,
హృదయంలో
విషాద
మేఘాలు కమ్ముకొని..
కన్నీరై కురిసిన వేళ ..
ఆశలు ఆవిరై,
ఆనందం క్షణాలు
అంతమై..
ఆలోచనలే క్షీణించి
ఓదార్పు కోసం
వేచి చూసే
ఓ వేదన పడ్డ
మనసు..
చీకటి దారిలో
నిరీక్షణ చూపులు
కరిగిపోయే..
గాయ పడ్డ
హృదయం
మౌనంగా రోదించే..
ప్రతి మారు
నీ తలపులు
కన్నీటి చినుకులుగా మారి
ఒకొక్క
అక్షర రూపంగా
రూపు దిద్దుకుంటున్నాయి..
నీ తలపులు
మాత్రమే శాశ్వతమని
తెలిసిన..
నీ నీడ కోసం
నా ఈ మనసు
ఎప్పుడు అన్వేషిస్తూనే ఉంటుంది..
రేణుక సుసర్ల

ఆపకు నీ పోరాటం

ఓ మనిషి
ఆపకు నీ పోరాటం
ఆఖరి బొట్టు
రాలేవరకు..
ఆగకు నీ గమ్యం 
చేరే వరకు..
విశ్రమించకు
అనుకున్నది
సాధించే వరకు..
బుద్ధి బలం
నీ శస్త్రం..
గుండె బలం
నీ అస్త్రం..
నీ ధైర్యమే
నీ సైన్యం..
అక్షరమే
నీ ఆయుధం..
మాటలే
నీ తూటాలు..
ఆవేశమే నీ ఖడ్గం..
ఓ మనిషి..
వెనుక తిరిగి
చూడకు..
వెన్ను తట్టి
సాగిపో..
ఎగిరే పక్షికి
ఆకాశం ఒక హద్దా
ఈదే చేపకి
సముద్రం ఒక లెఖ్ఖ
భయం లేదు
జయం ఇక నీదేలే..
రేణుక సుసర్ల

మనసు

నాదే అనుకొని అడిగా
నిన్ను మరచిపొమ్మని..
కానీ అది ఎప్పుడో నీది
అయినప్పుడు 
నాకు అడిగే
అధికారం కూడా లేదే..
ఉండ పట్టని
నా హృదయం
నీ కన్నీళ్లు తుడవమని
అడిగింది..కానీ
నిన్నే జీవితం
అనుకున్న దానికి
ఎలా చెప్పను...
జీవం లేని నా శరీరానికి
ఆ పని సాధ్యం కాదని..
చావు శరీరానికి కానీ
మనసుకి కాదుగా..
రేణుక సుసర్ల

గత స్మృతులు

ఎప్పుడో ఎక్కడో 
కలిసాం
కళ్ళతో భావాలు 
ఇచ్చి పుచ్చుకున్నాము..
మూగగా మనసులు 
మాట్లాడుకున్నాయి...
కాలం దూరం చేసింది
ఇద్దరిని..

చెప్పే ధైర్యము లేక
చేసే సాహసము లేక
కాల గర్భంలో
కనుమరుగయ్యాయి
రెండు మనసులు ..

కానీ
మది గనిలో
మరపురాని
అమృత సిరులుగా
ఇప్పటికి
దాగి ఉన్నాయి..
తొలిప్రేమ తొలకరి జల్లు
అంత మధురం..
ఎంత తడిసిన
తనివి తీరదు..
ఏ నాటికి
మరపును రాదు

రేణుక సుసర్ల

సరదా సరదాగ

ప్రతి ఇల్లాలి నోట
ప్రతి ఇంటా
భానుడు ఉదయించిన 
తొలిక్షణం
కాఫీ తదుపరి
గుర్తుకు వచ్చేది
మన పాసి పని చేసే
పని అమ్మాయే..
ఇంట్లో అయిన వాళ్ల కంటే
ఆత్మీయులు వీళ్ళు..
వంట్లో వేడి
పుట్టించకుండా జ్వరం తెప్పించగల
సమర్థులు..😀
సగటు గృహిణికి
ఇష్ట సఖులు..
మనసుని ఏలే
పట్టపురాణులు..😀
వారసత్వం లేకుండా
మన ఆస్థికి
హక్కుదారులు ...
అవసరం మనది
అవకాశం వాళ్ళది..
నిరక్షరాస్యత,
పేదరికం సంకెళ్లు
పెద్ద ఉద్యోగాలు
చెయ్య నివ్వలేదు..
కష్టపడి చేసే
పని ఏదైనా
ప్రశంసా నీయమే..
పెద్ద మనసుతో
మెలుగుదాం..
సగటు వృత్తికి
గౌరవం ఇద్దాం..
రేణుక సుసర్ల

ఎంత మధురం..

అమ్మ పొత్తిళ్ళలో
పాలుతాగే పసిపాప
ఎంత మధురం..
సెలయేరు ముంగిట 
సేదదీరే పచ్చని పైర్లు
ఎంత మధురం..
కైలాసం తలపించే
హిమగిరి సొగసులు
ఎంత మధురం..
పిల్లని గ్రోవి ఊదే
చిన్ని కృష్ణుని మురళీ గానం
ఎంత మధురం..
సూర్యోదయాన ఆలపించే
భూపాల రాగం
ఎంత మధురం..
వెన్నెల పొద్దులో సువాసన విదజల్లే
జాజి, విరాజాజి
పరిమళాల గాలులు
ఎంత మధురం...
ఆత్మీయులతో నిండిన ఇల్లు
అనురాగాలకు పుట్టినిల్లు
నా ఇల్లు అన్నిటికంటే
మధురాతి మధురం..
రేణుక సుసర్ల
శుభోదయం

10, ఆగస్టు 2017, గురువారం

ఓ మనిషి..

నడిచే సూర్యుడి వై రారా
ఉరిమే మేఘము వై రారా
నీటిలో నిప్పు వై రారా
భగ భగ మని అగ్ని గోళమై
రా రా
ఓ మనిషి..
వెచ్చని నెత్తురి సెగలుగా
రారా
ఆవేశం ,సాహసం ఊపిరిగా
రారా
ఆలోచన, ఆవేదన,
ఆయుధమై రారా
ఎగిసే కెరటమై...
ఉవెత్తున లేచే అలల వై
రారా..
ఓ మనిషి..
గర్జించే సింహాని వై రారా
శాసించే వాక్కు వై రారా
దండించే శక్తి వై రారా
దుష్టులకు అరిష్టమై రారా
హర్షించే శిక్ష వై రారా
ఓ మనిషి...
మరో పసిడి ప్రపంచం
సృష్టించగా రారా
ఓ మనిషి..
రేణుక సుసర్ల

తోడు రానా ప్రియా!

వెంట నడిచిన 
చెలికాడు 
సరసన లేడు..
చేరదీసిన చెయ్యి 
చేరువలో లేదు..
కలసి వేసిన
అడుగులు
కనుమరుగయ్యాయి..
గుండెలో
విషాదపు మేఘాలు
కమ్ముకున్నాయి..
వెళ్లిపోయిన కాలమే
తిరిగి వస్తే
నేను నీ వెంటే
తోడు రానా ప్రియా!

మధ్య తరగతి జీవితం

ఉదయించిన 
సూరీడు వెలుగులు..
మొదటి తారీకు
జీతాల కాంతులు..
సగటు ఇల్లాలికి
యదలో కోరికల గుర్రాలు
పరుగులిడుతూ
ఊహలోకంలో విహరిస్తూ ఉంటాయి...

అద్దె డబ్బులు ఆరువేలు
పచారీలు ఐదు వేలు
చంటాడి ఫీస్ రెండు వేలు
పెద్ద దాని కోచింగ్ ఫీస్
మూడు వేలు..
కరెంట్, నీళ్లు , కూరల ఖర్చు
మిగిలింది చేతిలో వెయ్యి..
ముందు నుయ్యి..
వెనుక గొయ్యి..
గడవాలి నెలంతా అంది
చేతిలో రుపయ్యి.
సగటు మనిషి మనసు
వెకిలిగా నవ్వింది...
ఇల్లాలు విహరించింది చాలని
కలల లోకం నుండి
ఇహలోకం కి వచ్చింది..
రూపాయిని చూసి విరక్తిగా నవ్వింది..
నీ బరువు ఇక పెరగదా?..
అని ఆతృతగా చూసింది..
మధ్య తరగతి బతుకు
ఇంతే ...
గ్రహణం పట్టిన
భానుడల్లె
అని నిట్టూర్చింది..
పోని వచ్చే నెల
ఆశగా
అనుకుంది..

రేణుక సుసర్ల..

తల్లడిల్లిన మనసు

ప్రతి తల్లడిల్లిన మనసు ఒక ఓదార్పు కోరుతుంది
నవ్వే ప్రతి కళ్లల్లో విషాదపు లోతులెన్నో ఎవరికి తెలుసు..
మంచిగా కనిపించే ప్రతి ముఖం వెనక ఎన్ని ముసుగులో..
మత్తులో ఉన్న ప్రతివాడు తాగుబోతు కాదు..
ప్రతి మనిషి చెడ్డ వాడు కాదు ..
మనసున్న ప్రతివాడు మంచివాడే..
ప్రతి ప్రేమ ద్వేషం తో అంతం కాదు..
వయసు బాల్యాన్ని హరిస్తుందేమో కానీ బాల్యస్మృతులని కాదు..
నీ జీవితం నీది కానప్పుడు నీకు చావిమ్మని దేముడ్ని అడిగే హక్కు నీకు లేదు..
ఆరి పోయే ప్రతి దీపం కి కారణం ఎప్పుడు వీచే గాలి కాదు..
ప్రేరణ గుల్జార్ గారి పోయెమ్
రేణుక సుసర్ల.

మరణం..మనసు

మరణమా... ఎందుకు
నీ వికటాట్టహాసం?
మనుషులని దూరం చేసినందుకా?
బంధాలను ఛిద్రం చేసినందుకా?
స్ఫురణతోనే భయభ్రాంతులకు
గురి చేస్తున్నందుకా?
నువ్వు మమ్మల్ని విడదీసి గెలిచా వనుకుంటున్నావేమో..
అంతా నీ భ్రమ!
ఎప్పటికి విడదీయని
బంధాలు, అనుబంధాలతో పెనవేసుకు పోయిన
దాన్ని నేను
హృదయాలను కలిపే నేర్పు నాది
నా సుగుణాల సౌందర్యంతో అందరి గుండెలో పచ్చబొట్టులా నిలిచే దాన్ని...!
ప్రతి హృదయంలో అనుక్షణం స్పందిస్తూనే ఉంటా...
ఇంతకీ నేనెవరినంటావా....?!
నేనే మనిషిలో
ఉన్న మనసుని..!
శరీరం ఉన్నంత
వరకే నీ మనుగడ..
కానీ నేను ఆజన్మాంతం
ప్రతి గుండెల్లో కొలువై ఉంటా..
ఆజన్మాంతం అనురాగం పంచుతూనే వుంటా..
ఓ మరణమా!
ఇప్పుడు చెప్పు
నువ్వు గొప్పా...
నేను గొప్పా..
రేణుక సుసర్ల.

28, జూన్ 2017, బుధవారం

నీ కోసం

ప్రతి రాత్రి ..
నీ రూపం 
కలతో పాటు కరిగిపోతుంది 
అనుకుంటా కానీ 
ప్రతి రోజు కొత్త కాంతులతో 
ఉదయించే భానుడల్లే 
కొత్త పులకింతలేవో
మనసులో రేగుతూ 
ఉంటాయి..
పదే పదే 
ఇంకా తడి ఆరని 
నీ తలపులు ఎదలో
మెసులుతూనే ఉంటాయి..

గాలిలో వచ్చే
గులాబీల సువాసన 
ఇంకా నీ రాకని 
తెలుపుతూనే ఉంటాయి..
వెన్నెల రాత్రులు 
నీ కోసం వేచి చూస్తూనే ఉంటాయి.. 
మనం కలిసింది 
ఒక్క మారే అయిన..
ఎందుకో 
నీ జ్ఞాపకాలు
మనసు పందిట్లో 
పొదరిల్లులా 
అల్లుకుపోయాయి...

ప్రియా! నువ్వక్కడ 
నేనిక్కడ 
కలిసేది ఎప్పుడో, ఎక్కడో 
అయిన క్షణం కూడా 
నిలవలేెను నీ తలపు లేనిదే
నా బ్రతుకనేదే లేదు 
నువ్వు లేనిదే..
నా జీవితమే నువ్వు అయినపుడు..
దూరాలు భారం కాదు ప్రియా!

రేణుక సుసర్ల

చిన్నారి ఇక లేదు


కొందరి నిర్లక్ష్యం ఒక చిన్నారి నిండు ప్రాణం తీసింది..
అమ్మా అనే
నా ఆర్తనాదం
లోకానికి 
వినిపించనులేదు..
అక్క, నాన్న
కనిపించను లేదు
తల తిప్పి చూస్తే
రాక్షస కోరల్లా
మట్టి పెళకలు..
చుట్టూ చీకటి..
ఎండి పోయిన
ఎడారిలా నా గొంతు..
ఆగిపోతున్న శ్వాస..
నిర్జీవమవుతున్న
నా శరీరం..
కడుపులో చెల రేగిన
ఆకలి మంటలు...
కానీ గొంతు పెగలటం
లేదు..
ఒక్క మారు నువ్వు,
నాన్న, అక్క
గుర్తొచ్చారు అమ్మా!
నాకు మళ్ళా నీ చేతి గోరుముద్దలు
తినాలని ఉంది..
నీ వడిలో ఆదమరిచి
నిదుర పోవాలని ఉంది
నాన్న తో రోజు పొలం కి వెళ్లాలని ,
అక్కతో ఆట
లాడలని ఉందమ్మా !
ఇలా దోబూచు లాడుతూ
మీకు ఎవ్వరికి
కానరాకుండ
పాతాళ గర్భంలో
భూదేవి వడిలో
నిదుర పోవాలని
లేదమ్మా!
అమ్మా నన్ను
నీ దగ్గరకు చేర్చమని
ఆ దేముడితో చెప్పమ్మా!
చివరికి దేముడే
గెలిచాడమ్మ నన్ను
తన వడిలోకి
చేర్చుకున్నాడమ్మ..😔
నా స్నేహితురాలు Padmaja Savana ఆవేదనతో రాయమంటే రాసినది...

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...