28, జూన్ 2017, బుధవారం

నీ కోసం

ప్రతి రాత్రి ..
నీ రూపం 
కలతో పాటు కరిగిపోతుంది 
అనుకుంటా కానీ 
ప్రతి రోజు కొత్త కాంతులతో 
ఉదయించే భానుడల్లే 
కొత్త పులకింతలేవో
మనసులో రేగుతూ 
ఉంటాయి..
పదే పదే 
ఇంకా తడి ఆరని 
నీ తలపులు ఎదలో
మెసులుతూనే ఉంటాయి..

గాలిలో వచ్చే
గులాబీల సువాసన 
ఇంకా నీ రాకని 
తెలుపుతూనే ఉంటాయి..
వెన్నెల రాత్రులు 
నీ కోసం వేచి చూస్తూనే ఉంటాయి.. 
మనం కలిసింది 
ఒక్క మారే అయిన..
ఎందుకో 
నీ జ్ఞాపకాలు
మనసు పందిట్లో 
పొదరిల్లులా 
అల్లుకుపోయాయి...

ప్రియా! నువ్వక్కడ 
నేనిక్కడ 
కలిసేది ఎప్పుడో, ఎక్కడో 
అయిన క్షణం కూడా 
నిలవలేెను నీ తలపు లేనిదే
నా బ్రతుకనేదే లేదు 
నువ్వు లేనిదే..
నా జీవితమే నువ్వు అయినపుడు..
దూరాలు భారం కాదు ప్రియా!

రేణుక సుసర్ల

చిన్నారి ఇక లేదు


కొందరి నిర్లక్ష్యం ఒక చిన్నారి నిండు ప్రాణం తీసింది..
అమ్మా అనే
నా ఆర్తనాదం
లోకానికి 
వినిపించనులేదు..
అక్క, నాన్న
కనిపించను లేదు
తల తిప్పి చూస్తే
రాక్షస కోరల్లా
మట్టి పెళకలు..
చుట్టూ చీకటి..
ఎండి పోయిన
ఎడారిలా నా గొంతు..
ఆగిపోతున్న శ్వాస..
నిర్జీవమవుతున్న
నా శరీరం..
కడుపులో చెల రేగిన
ఆకలి మంటలు...
కానీ గొంతు పెగలటం
లేదు..
ఒక్క మారు నువ్వు,
నాన్న, అక్క
గుర్తొచ్చారు అమ్మా!
నాకు మళ్ళా నీ చేతి గోరుముద్దలు
తినాలని ఉంది..
నీ వడిలో ఆదమరిచి
నిదుర పోవాలని ఉంది
నాన్న తో రోజు పొలం కి వెళ్లాలని ,
అక్కతో ఆట
లాడలని ఉందమ్మా !
ఇలా దోబూచు లాడుతూ
మీకు ఎవ్వరికి
కానరాకుండ
పాతాళ గర్భంలో
భూదేవి వడిలో
నిదుర పోవాలని
లేదమ్మా!
అమ్మా నన్ను
నీ దగ్గరకు చేర్చమని
ఆ దేముడితో చెప్పమ్మా!
చివరికి దేముడే
గెలిచాడమ్మ నన్ను
తన వడిలోకి
చేర్చుకున్నాడమ్మ..😔
నా స్నేహితురాలు Padmaja Savana ఆవేదనతో రాయమంటే రాసినది...

సిన్నదాన... సిన్నదాన


చిన్న దాన ఓసి చిన్న దాన
మనసు పడితినే నీ మీద
నిను
సూస్తూ ఉంటే మనసులో
గుబులవుతాది
గుండె లబుకు లబుకు
అంటాది..
బుగ్గ మీద సిటికెయ్యాలని
ఉంటది..
నీ తలలో మల్లెలు తురమాలని
ఉంటది..
సిన్నదాన ఓసి సిన్నదాన
మనసు పడితినే నీ మీద
సందే పొద్దులో సైకిల్ మీద
సంతకు ఎట్టుకెళ్లాలని
ఉంటది
సీర, రయిక కొని ఇయ్యాలని
ఉంటది
రంగు,రంగుల గాజులు తొడగాలని
ఉంటది..
నీ సన్నటి నడుం మీద సక్కిలిగింత ఎట్టాలని
ఉంటది..
సిన్నదాన ఓసి సిన్నదాన
మనసు పడితినే నీ మీద
నీ మేను నిండా నగలు తొడగాలని
ఉంటది..
నీ కోసం కారు, బంగ్లా కొనాలని
ఉంటది..
నీ మెళ్ళో తాళి కట్టాలని
ఉంటది
పొద్దుకాడ నీ వడిలో సేద తీరి కళ్లల్లో
మత్తుగా సూడాలని
ఉంటది..
నన్ను లగ్గం ఆడే మరదలా
నీ మావని నేనే నే
మనసు పడితినే నీ మీద

25, జూన్ 2017, ఆదివారం

కవి...

ఇప్పటివరకు రోజుకి ఒకటి చెప్పున ఈ రోజుకి నాది శతకం పూర్తయింది..ఇంతవరకు తమ కామెంట్స్, likes తో నన్ను ప్రోత్సహించిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు🙏
నా కవితలకు తన చిత్రాలతో రూపం ఇచ్చిన మధుకి ప్రత్యేక ధన్యవాదాలు.
నా 100 వ కవిత

కవి...

ఒరే తమ్ముడు...
అంకెలు మారాయి,
క్యాలెండర్ లో
పేజీలు తిరిగాయి
కాలాలు మారాయి
కానీ
మనిషి ఆలోచనలు
మారలేదురా
వీళ్ళింతేరా..
నిండా అనుభవించని
బాల్యాన్ని
సొమ్ము చేసుకునే
వాళ్ళురా
పేదరికాన్ని పరిహాసం చేసేవాళ్ళురా..
ఆడతనాన్ని
వంచించే వాళ్ళురా..
దగాకోరులు, దుర్మార్గులు
వీళ్ళింతేరా...
ఒరే తమ్ముడు..
నువ్వు మటుకు
మారకురా..
నీ కలానికి
పదును పెట్టి
మనసుతో స్పందించి
ఆవేశ జ్వాలని
పుట్టించు
ఆక్రన్దన
అలల ఘోష
వినిపించు
ప్రేమ జల్లులు
కురిపించు
ఆక్రోశం వెలిదీసి
ఖడ్గాని గా
మరల్చు...
నీ రాతలతో
ప్రతి మనిషిలో
ఆలోచన పుట్టించు..
నిశ్శబ్ధపు సవ్వడిలో
కూడా అర్ధాలు
వినిపించు
నీ అక్షర జ్ఞ్యానంతో
ప్రతి మనసులో
చిరుదీపం వెలిగించు..
ఓ కవి...
నువ్వు రాత్రి కూడా
ఉదయించే
ఒక సూరీడివిరా..

మనిషి తీరు

ఎన్ని మార్లు వెన్నుపోటు పొడిచిన
ఎన్ని ఛీత్కారాలు ఎదురైన మారదు ఈ పిచ్చి మనసు..
ఎందుకో ఆ ఆరాటం అందరూ
నా అనే భావన...
అయిన ఎవర్ని అని 
ఏమి లాభం?
ఈ కష్ట నష్టాల
కసాయి ప్రపంచంలో
ఎవరి కష్టం వారిదే..
ఎవరు ఆదుకుంటారు?
ఓదార్పు కోసం ఎదురు చూస్తే నిట్టూర్పుల నిరీక్షణలే ఎదురవుతాయి..
కారుణ్యమెరగని కష్టం
కన్నెర్ర జేస్తే కలికాలం అని సరిపెట్టుకొని నీతి వాక్యాలు వల్లించుతారు తప్ప
ఎవరు ఆదుకోరు...
తోడుగా ఉన్న వారే ఆపదవస్తే
మంచితనానికి ముసుగు
కప్పు తారు..
చీకటి వీధుల్లో నీ నీడే నిన్ను వదిలేసినప్పుడు
మనిషి ఎంత ?
మనసెంత?..
కానీ ప్రతి ఓదార్పు కోరే హృదయానికి నే ఉన్న
అంటోంది నా ఈ
మూగ మనసు..
రేణుక సుసర్ల

23, జూన్ 2017, శుక్రవారం

నేను..

నేను..
వినీల ఆకాశంలో ఎగిరే
స్వేచ్ఛ విహంగానిని..
నా జీవితపు పూదోటలో
విరించే కుసుమాన్ని..
అనురాగ, రాగాలు పండించే
ఆనందపు హరివిల్లులో
శ్వేత వర్ణాన్ని..
నమ్మకానికి ప్రతిరూపంగా నిలిచే
మంచి స్నేహాన్ని..
వికటపు ఆలోచనలతో ఉన్న మనసులకి దహనం చేసే కార్చిచ్చుని...
సుమధుర కావ్యాలు పండించే
సాహిత్య ప్రపంచంలో
ఒక బీజాక్షరాన్ని..
అమ్మ, నాన్నల
ఆత్మాభిమానాన్ని...
తోబుట్టిన వాళ్లకు ఒక
మంచి నేస్తాన్ని..
నా మగని జీవిత రధ సారధిని..
నా కన్న పిల్లలకు అనుక్షణం కాపాడే కనురెప్పని..
నన్ను నన్నుగా ప్రేమించే ప్రతి ఒక్కరికి
నేను ఒక
ఆత్మస్థైర్యాన్ని...
రేణుక సుసర్ల..

ఎదురుచూపు

కళ్ళల్లో చెరిగి చెరగని
కాటుక రేఖలా
ఆశ, నిరాశల మధ్య..
నీ రాక కోసం నిరీక్షణ..
నువ్వు లేని ప్రతి క్షణం
నీతో గడిపిన క్షణాలు
గుర్తుచేసుకుంటూ...
మవునంగా హృదయం
రోదిస్తూ ఉంటే..
అస్తమిస్తున్న సూరీడు
మరల తిరిగి వస్తా
అని
అభయమిస్తున్నట్టు
ఎక్కడో
మనసుకి ఊరట..
కానీ
నీ రాక ఎడారిలో
ఎండమావులు అని తెలిసి
భారంగా నిట్టూరుస్తు
ఉంటే
వెన్నెల వెటకారంగా నవ్వింది..
వీచే గాలి వింతగా విస్తుపోయింది...
నువ్వు తనకిచ్చింది ప్రేమ అయితే నీకు మిగిలింది
ఆవేదనే కదా అని ...
కాలం వెక్కిరించింది...
రేణుక సుసర్ల

ఆలోచన

హృదయంలో రాగ,
ద్వేషాల అలజడి..
మస్తిష్కంలో సునామీల సుడిగుండాలు..
కానీ మనసు పాటించింది నిశ్శబ్ధం...
మౌవునం మాట వినక
గుండెలో రగులుతున్న
ఒక అగ్నిపర్వతం బద్దలైతే...
వచ్చేది..
జగుప్స, నిర్లక్ష్యం,
ఏహ్యం అనే లావా...
బంధాలని కలకాలం నిలపాలి అనే ఆరాటం..
ప్రేమ ఏనాటికైనా అర్ధం అవుతుంది అనే ఆశ...
ఆపుతోంది నాలో ఆవేశం..
ఆలోచిస్తోంది నాలోని వివేకం..
రేణుక సుసర్ల

జీవితం..

పుట్టుక నుండి చావు ప్రస్థానం వరకు...
మంచి, చెడుల సమ్మేళనమే జీవితం..
సుమధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాల కలయికే
జీవితం..
సుఖ,దుఃఖాల ఆటు, పోట్ల అలలే జీవితం..
లాభ, నష్టాల అలజడుల వొరవడే జీవితం..
రాగ ద్వేషాలు , బంధాలు,అనుబంధాల అల్లికే జీవితం..
జీవితం అనే మహాభారత సంగ్రామంలో
ప్రతి మనిషి ఒక అభిమన్యుడే....
రేణుక సుసర్ల

నాన్న..

కంటికి రెప్పలా కాపాడేది అమ్మ అయితే ...
ఆ కంటి కొలనులో నీరు రాకుండా
చూసేది నాన్న...
తనలో ప్రేమ నంత గుండెలోతుల్లో దాచి
బయటకి కాననీయక
అడుగడుగునా మనకి నీడలా వెన్నంటి ఉండే వాడే నాన్న..
అహర్నిశలు తన శ్రమని మన ప్రగతి కోసం ఖర్చు పెట్టేవాడు నాన్న..
మన విజయ శిఖరాల అంచులలో తన ఆనంద జెండాన్ని ఎగరేసేవాడు
నాన్న..
జీవితం అనే పాఠశాలలో
నడవడిక అనే పాఠాన్ని
నేర్పిన మొదట గురువు
నాన్న
సంతోషం లో అయిన ,
బాధలో అయిన ,
పెదవులపై ఎప్పుడు
చిరునవ్వు సింగారించుకునే వాడు నాన్న..
ఎల్లప్పుడు సంతోష సరగాలని మనకి పంచి...
బాధ అనే గరాళ్లాన్ని గొంతులోని దిగమింగుకొనే వాడే
నాన్న..
ప్రతి క్షణం తన పిల్లల కోసం
నిస్వార్ధం అనే బట్ట కప్పుకొని
బంగారు భవిషత్ ని అందించేవాడు
నాన్న...
అటువంటి ఎందరో మహోన్నతులైన
తండ్రులందరికి....🙏
రేణుక సుసర్ల..

అరణ్య అందాలు

దట్టమైన నల్లమల కీకారణ్యానికి
వాహ్యాళి కి
వేంచేసిన తరుణంలో..
పచ్చని చెట్లు తోరణాలై 
మా రహదారిని అలంకరించగా
చల్లని చిరుగాలికి తమ లేలేత
రెమ్మలతో, కొమ్మలతో
స్వాగతం తెలుపగా...
రకరకాల అడవి పక్షులు
తమ మృదువైన స్వరములతో
సంగీతము వినిపింపగా
పెల్లుబిక్కిన ఉత్సాహముతో సీతాకోకచిలుకలు తమ అందమైన రెక్కలతో నాట్యము చేయగా...
నీలి మేఘాలు చల్లని వాన చినుకులు పన్నీటిజల్లులుగా కురిపించి
మమ్మల్ని వేంకొని
తమ స్పర్శతో ఆలింగనం జేయ
అరణ్య అందాలు చూచుటకు తోడ్కొనిపోయే...
ప్రకృతిని వర్ణింప ఎవరి తరము..
రేణుక సుసర్ల

అద్దం

అబద్ధం...
చూడ్డానికి అందంగా ఉంటుంది
వినడానికి ఇంపుగా ఉంటుంది
నమ్మడానికి వీలుగా ఉంటుంది
ఎందుకంటే దానికి రూపం 
మనం ఇస్తాం కదా!

అదే నిజం..
వినడానికి కఠినంగా ఉంటుంది
మనసుకి చూడ్డానికి బాగుండదు
నమ్మడానికి ఆస్కారమే లేదు..
ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక...
అబద్ధం తో మొదలైనది ఏది ఎక్కువ రోజులు నిలవదు..
అది స్నేహమైన, జీవితమైన...
ప్రేమైన, పెళ్ళైన...
రేణుక సుసర్ల

జీవితం

జీవితం సాధించేదాక
ఓటమి గెలుపొందేదాక
చీకటి వెలుగొచ్చేదాక
కన్నీళ్ళు ఓదార్పు లభించేదాక
విరులు వాడి నేలపై ఒరిగేదాక
వెన్నెల వెలుగు వేకువదాక
స్నేహం మరణించే దాకా..

కాలేజీ కబుర్లు..

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి...
అలనాటి కాలేజీ కబుర్లు..
ఒజ్జా బొక్కి బస్ తో పాట్లు
ఎక్కడి పడితే అక్కడ ఆగినప్పుడు అగచాట్లు...
బస్ లో కామర్స్ పిల్లల్తో
పట్టేవి చెమట్లు..
శ్రీను అన్నయ్య నా జడతో
బస్ సీట్ వెనక్కి వేసిన ముళ్ళు..
సీనియర్స్ ని చూస్తే
జలదరించేది వళ్ళు..
ప్రేమజిత్ ప్రేమ చూపులు
రోజరమణి మరిదిని నే చూసిన కొంటె చూపులు..
అమీర్ ఖాన్ కి రాసిన
ప్రేమ ఉత్తరాలు..
కమల్ హాసన్ పెళ్లి వార్త విని పెట్టుకున్న కన్నీళ్లు..
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
బస్ లో సీట్ కోసం
మగపిల్లల్ని బకరాలను
చేసిన సన్నివేశాలు..
లెక్చరర్ ముందర వేసే
వెధవ వేషాలు..
దిబాకర్ సర్ కెమిస్ట్రీ క్లాస్
అంటే లోకువ ..
రాఘవేంద్రరావు సర్ క్లాస్ అంటే అందరికి ఎంతో మక్కువ..
మనోజ్ సర్ మహత్తరమైన బొటనీ పాఠాలు
బిజయ లక్ష్మీ మిస్రా మామ్
అంద చందాలు
త్రిపాఠీ మామ్ తీపి కబుర్లు..
గుర్తుకొస్తున్నాయి ,
గుర్తుకొస్తున్నాయి...
కాంటీన్ లో వేసిన
కొంటె వేషాలు
సైట్ కొట్టడానికి వచ్చిన
సొల్లు గ్యాంగ్ కి బిల్ వాయింపులు...
తుంటరిగా ప్రిన్సిపాల్ రూమ్ ముందర చేసిన ఈల కోసం ప్రాక్టీసులు..
కామన్ రూమ్ ఎదురుగా
గోడపై కూర్చున్న
తెలుగు తొట్టెగ్యాంగ్
కామెంట్స్..
సహాయం పేరిట వాళ్లతో చేయించిన వెట్టిచాకిరీలు..
గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి...
ఎగ్గొట్టిన కెమిస్ట్రీ క్లాసులు,
అర్ధం కానీ ఫిసిక్స్ పీరియడ్
జూలోజి లాబ్ లో వాంతుల గోల
కెమిస్ట్రీ లాబ్ లో విన్యాసాల హేళ
ఎక్స్ట్రా క్లాస్ పేరిట ..
భరణి కొండపై స్నేహితులతో ముచ్చట్లు..
డౌట్స్ పేరిట లెక్చరర్స్ ని
కాకా పట్టడానికి పడ్డ పాట్లు..
ఎన్నో జ్ఞాపకాలు
ఇంకెన్నో
మధురానుభూతులు
గుండె పొరల్లో
అపురూపంగా దాచుకున్న...
ఈనాడు మీతో పంచుకున్న...
రేణుక సుసర్ల

స్వప్నం

వలపు గాలి తిమ్మెరలు
కొంటెగా వీస్తూ ఉంటే,
ఏమిటో ఆ హాయి..
మనసు ముంగిట
ప్రేమ ముగ్గులు 
అందాలు హద్దుతూ ఉంటే,
ఏమీటో ఆ ఉబలాటం...
పండు వెన్నెల అందాలు
చూసి శరదృతువు
ముందే వచ్చిందేమో అని
పిచ్చి మనసుకి ఆరాటం..
మబ్బుల చాటున దోబూచులాడుతున్న చందమామ నాతో
నా ప్రియుని సందేశం
పంపినట్టు మనసు పరిపరి విధాలా తొందర జేస్తోంది...
ఆలోచనల జలపాతం
నుండి
అలా జారానో లేదో..
కళ్ల ఎదుట
మనసుపడిన మగడు గమ్మత్తుగా
మల్లెపూల మాల నా జడన తురుముతూ...
కళ్లల్లో కొంటెగా చూస్తూ ఉంటే...
ఆగిపోయిన నా గుండె
ప్రేమ సవ్వడితో పులకించిపోయింది...
పరవశంతో
కళ్ళు తెరిచానో లేదో
మంచు చినుకులాంటి స్వప్నం..
ఉషా కిరణాల పొద్దులో కరిగిపోయింది...
రేణుక సుసర్ల

ఇదే జీవితం...

మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో వీడలేని నేస్తాలెన్నో
విడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో మధురమయిన
క్షణాలెన్నో
కవ్వించే కబుర్లేన్నో
మాయమయ్యే మార్పులెన్నో..
అవసరానికి ఆడిన
అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన
చిలిపి పనులెన్నో
ఆశ్చర్యపరిచే
అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో..
ముసుగు వేసిన
మనసుకు
మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో... మనిషి జీవితంలో
మరువలేనివి ఎన్నో ..
ఇదే జీవితం...
అనుభవించు
అనుక్షణం
ఆనందించు ప్రతి క్షణం ..

9, జూన్ 2017, శుక్రవారం

నీ రూపం

నీ రూపం నా మనసులోంచి చెరుపుదామనుకుంటే
నువ్వు ప్రేమగా చూసే కళ్ళు
వద్దని చెపుతాయి...
నీ పేరు నా పెదవులపై పరవద్దు అనుకుంటా కానీ నీ మవునం
మృదువుగా వారిస్తుంది..
అసలు నీ తలపులే వద్దులే అనుకుంటా ..
కానీ ప్రతి క్షణం నీ కోసం జీవించే నేను
 "నువ్వు" అనే నా జీవితాన్ని ఎలా మర్చిపోగలను?..
అసలు నువ్వు నన్ను ఎన్ని మార్లు మరచిపొమ్మని చెప్పిన
నా మనసుకి పౌరుషమే లేదా?
ఏంటో పిచ్చి మనసుకి ఇంకా తీరని ఆశ...
ఏనాడైనా నా ప్రేమ నిన్ను నా దరికి చేరుస్తుందని...
మనిద్దరని ఏకం చేస్తుందని..
నీ రాక కోసం చూసి చూసి
నా కళ్ళల్లో కన్నీళ్ళకి కూడా
చోటు లేదు పొమ్మన్నాన్నే..
నీ ఆలోచనల సముద్రంలో
నిత్యం నీ ఆటు, పోట్ల
అలజడిలో ... నీ కోసం..
కొట్టుమిట్టాడుతున్న
నీ చెలి..
రేణుక సుసర్ల

అనురాగ వీణ

నీ హృదయ రాగంలో
అనురాగ వీణనై
ప్రేమ రాగాలే
పలికించనా..
లేక
నీ సాహిత్య
ప్రపంచంలో
సిరా చుక్కనై
కొత్త కావ్యాలకి
అక్షర రూపం దిద్దనా
లేక
నీ అరచేతలో కుంచెనై
ఊహకందని
చిత్రాన్నై
మైమరపించనా
లేక
నీ చేతిలో ఉలినై
అపురూప శిల్పంగా
నన్ను నేను
రూపుదిద్దుకోనా...
లేక

వినీల ఆకాశంలో
స్వేచ్ఛ విహంగాలతో
హద్దులేని
ప్రేమ పక్షులమై
విహరిద్దామ..
లేక
నీ జీవిత
రహదారిలో..
బాటసారినై
నీతో కలసి
ప్రతి అడుగు
వేయన...
రేణుక సుసర్ల
శుభోదయం😂

8, జూన్ 2017, గురువారం

కాలం..


మనిషి జీవితాన్ని
నడిపించేది..
గత స్మృతులని గుర్తుచేసి మైమరిపించేది..
మానలేని గాయలని 
తన ప్రవాహంలో
రూపుమాపేది..
ఎన్నో జీవిత సత్యాలని చవిచూపేది..
ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసేది..
మేధావులు సైతం పరిష్కరించలేని ప్రశ్నలకి
సమాధానం తెలిపేది..
కాలం..
ఎంత శక్తిమంతులైన, విజ్ఞానవంతులైన
తన ముందు
తలవంచుకునేల చేసేది..
మన పురాణాలే దీనికి
నిదర్శనం..
త్రేత యుగం లో
రావణుడు,
ద్వాపరంలో కంసుడు, దుర్యోధనుడు,
శిశుపాలుడు
అందరి అహంకారాన్ని
కాలమే..
అణగతొక్కింది...
కాలం ముందు
అందరం సమానమే..
కాలం
కలిసి రాకపోతే బలవంతుడు కూడా బలహీనుడవుతాడు...
కాలం కలిసి వస్తే చీమ కూడా ఏనుగు అవుతుంది...
రేణుక సుసర్ల

ఓ నా ప్రియ

నిట్టూర్పులే నిరీక్షణ
అయిన వేళ
ఆశలు తీరం
దాటినవేళ
చూపులు 
కనుచూపు దాటిన వేళ
విరహ క్షణాలు
మనసును తాకే
సమయాన్న
మనసులో
మెదిలే నీ రూపం
మోముపై
విరిసె దరహాసం
నీ మౌనమే
నా ఆలపన గా
నీ ధ్యానమే
ఆలంబనగా
నేను పరవసించిపోన
ఓ నా ప్రియ....
రేణుక సుసర్ల
శుభోదయం

తల్లి ప్రేమ

కపటం లేనిది కల్మషం లేనిది
తల్లి ప్రేమ..
మనలో ఏమి సద్గుణాలు లేకపోయినా
తన మనసుతో
ఎప్పుడు మంచి నే చూసేది
తల్లి ప్రేమ..
అవసరం అయితే ఆ దేముడ్ని కూడా తన పిల్లల కోసం ఎదిరించేది
తల్లి ప్రేమ..
తన కడుపు కోసం కూడా చూడకుండా ఎప్పుడు
మన ఆకలి కోసం
ఆరటపడేది
తల్లి ప్రేమ..
అమ్మ! నన్ను అంత సేపు
నీ భుజాల మీద
మోస్తావు ?
నీకునొప్పిగా లేదా ?
అని అడిగితే..
లేదు నాన్న..
నన్ను నాలుగు భుజాల మీద ఎత్తేవరకు నిన్ను మోస్తూనే ఉంటా
అని సమాధాన మిచ్చేది
తల్లి ప్రేమ..
అటువంటి తల్లి ప్రేమని
దేనితో వెలకట్టగలం?
ఎంత మంది మహారాజుల ఖాజానాలు కూడా
సరితూగవు కదా...
రేణుక సుసర్ల

3, జూన్ 2017, శనివారం

ప్రియమైన శత్రువు

సెలయేరు
చేతులు జాచిందో
లేక
చందమామే
ముందుకు వంగాడో!
వేలికొసల
చిరుస్పర్శలు..
ఎటు మళ్ళాలో తెలీక
పిల్లగాలి తత్తరపాటు..
కిటికీ అవతల
కొబ్బరాకుల
దొంగచూపులు..
మందహాసంతో
జారిపోతున్న క్షణాలు..
వెన్నెలెప్పుడు
నిద్రపోయిందో
తెలీని అచేతనస్థితి!
మంచం పక్కనే
వదిలేశాననుకున్న
నిముషాలన్నీ
మనసు పొరల్లోకి
ఎలా చేరాయసలు..??
నువ్వు వాకిలి
దాటగానే
ఖాళీ చేయాలనుకుంటే
చుట్టూ
నీ ఆలోచనల పహారా!
గేటు దగ్గర నిశ్చింతగా
నాట్యమాడుతున్న
మాలతీలతవే
నీ నిష్క్రమణ
నిజం కాదని
అభయమిస్తూ!!...
నీ దైన
నీ నేస్తం..🙂
Photo courtesy By: Sadasivuni Madhurasree

మన తెలంగాణ

తెలంగాణ దినోత్సవ 🍁🍁
ఆవిర్భావ సందర్భముగా....🍁
రాగాలు పలికే
భాష మాది..
మనసుని కదిలించే
పలుకు మాది..
అనురాగాలు
కురిపించే
ఆధిత్యం మాది..
తంగేడు పూల
సొగసు మాది..
బతుకమ్మ, బోనాలు
సంస్కృతి మాది..
రాణి రుద్రమదేవి,
ప్రతాప రుద్రుడు
పరిపాలించిన
ఘనత మాది..
నైజాంలు ఏలిన
రాష్ట్రం మాది..
బమ్మెర పోతన,
కాళోజీ,
దాశరధి కృష్ణ మాచార్యులు
ఇంకా
ఎంతోమంది జ్ఞ్యానులు
ఉద్భవించిన
రాష్ట్రం మాది..
గోల్కొండ, చార్మినార్,
కట్టడాలు మావి..
హుస్సేన్ సాగర్,
నాగార్జున సాగర్
అందాలు మావి..
ఎంతో ప్రతిష్ఠి
గాంచిన
కాకతీయ చరిత్ర
మాది...
కొహినూర్ వజ్రం
మాది...
యావత్
భారత దేశానికి
వన్నె తెచ్చిన
సానియా మీర్జా,
సైనా నెహ్వాల్
పి..వి.సింధు,
జ్వాల గుప్తా
క్రీడాకారుల
ఘనత మాది..
ఎందరో ఇంకెందరో
మహానుభావులు
పుట్టిన రాష్టం మాది...
అరుదైన ,ప్రాచీన
చరిత్ర కలిగిన
తెలంగాణ
రాష్ట్రం మాది...🙏🔷
రేణుక సుసర్ల

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...