28, ఏప్రిల్ 2017, శుక్రవారం

నా దేశం

ఎప్పుడు చూస్తానో
గాంధీ కలలు కన్న దేశాన్ని...
లంచం లేని ప్రభుత్వాన్ని...
నిస్స్వార్థ రాజకీయనాయకులని...
అర్థరాత్రి కూడా ఆడవాళ్లు క్షేమంగా సంచరించే రాజ్యాన్ని....

ఎప్పుడు చూస్తానో
ఆటంకావాదులు లేని భారత దేశాన్ని....
కుల, మత బేధాలు లేని సంఘాన్ని...
కాలుష్యం లేని పట్టణాలని...
పచ్చని చెట్లు, పైర్లతో నిండే భూమిని...
నీటితో కళ కళ లాడే జీవనదులని.....
ఎప్పుడు చూస్తానో...
నేను ఎప్పుడు చూస్తానో....
ఇంకెప్పుడు చూస్తానో🤔

ఒక్కోసారి..

ఒక్కోసారి..
గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది..
ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది..
వెలుగు కన్నా చీకటే బాగుందనిపిస్తుంది..
ఒక్కోసారి..
పరిచయంలేని
అపరిచితుల వద్దే
మనసు విప్పాలనిపిస్తుంది..
సమాధానం కన్నా
చిరునవ్వే చాలనిపిస్తుంది..
కళ్ళు మూసుకుని
గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది..
ఒక్కోసారి..
కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది..
నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది..
మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది..
ఒక్కోసారి.
నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది..
వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది..
మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది.. !

బాల్యం

మధురమైన బాల్యానికి తిరిగివెళ్లిపోతే
ఎంత బాగున్నో !!
అమ్మ వడిలో
ఆద మరిచి 
నిద్ర పోతే
ఎంత బాగున్నో!!

నానమ్మ
చందమామ కథలు
వింటూ....
అమ్మ చేతి కమ్మనైన గోరుముద్దలు తింటూ...
నాన్న దగ్గర
ముద్దు, మురిపాలు
కురుస్తూ ఉంటే
ఎంత బాగున్నో!!
గుజ్జన గూళ్ళు
కట్టుకుంటు
ఇసుకతో తల మీంచి తలంబ్రాలుగా
పోసుకుంటే
ఎంత బాగున్నో!!
తాత బడ్డీలో
బెల్లం కడ్డీలు,
జీళ్ళు తింటూ,
స్కూల్ కి వెళ్తే ,
ఎంత బాగున్నో!!
పండగ నాడు,
పట్టు పరికిణి జాకెట్టు
వేసుకొని,
చేమంతి పూల జడ
కుట్టుకుంటే
ఎంత బాగున్నో!!
అలా అన్ని
మరచిపోయి
అలుపు ఎరుగని
బాల్యంలోనే ఉండిపోతే
ఎంత బాగున్నో
ఇంకెంత బాగున్నో!!🤔

25, ఏప్రిల్ 2017, మంగళవారం

ఉత్తరం

చిఠీ ఆయి హై ఆయి హై చిఠీ ఆయి హై
పంకజ్ ఉదాస్ గారి పాట దూరంగా రేడియో లో వినిపిస్తోంది...
విని ముఖంలో నవ్వుతో కూడిన భాద పెల్లు బెక్కింది..
ఇక ఈ చిఠీలు అవి పాటల వరకే పరిమితం..
ఇప్పుడెక్కడ అసలి ఎవరికైనా ఈ కాలంలో పిల్లలకి కార్డ్, ఇన్లాండ్, enevelope లు అంటే అసలు తెలుసా అన్న అనుమానం కూడా రాకపోలేదు నాకు..
ప్చ్..అంత మారి పోయింది
ఆ రోజుల్లో పోస్ట్ మాన్ కోసం పడిగాపులు కాసుకొని కూర్చినే వాళ్ళం..నేను మా అక్క వాళ్ళు..
ఉత్తరం ఏదైనా వస్తే ఎవరు మొదట తీసుకొని చదువుతారో అన్నది మా మధ్య పోటీ.....
నేను అందరి కంటే చిన్న దాన్ని అవ్వడం వల్ల బాగా పేచీలు పెట్టి లాక్కొని, నేనె మొదట చదివే దాన్ని..
అయిన అప్పట్లో వచ్చిన లెటర్ బట్టి ఎవరు రాసేరో దేనికోసమొ అంచనా వేసేవాళ్ళం.
కార్డ్ ఐతే ఏ చావొ, లేక పుట్టుక గురించో
లేకపోతే మా మావయ్య రాసేవారు......
ఒరే రమణ నువ్వు, భార్య పిల్లలు క్షేమం అని తలుస్తాను.
ఇక్కడ నేను, మా అమ్మ , భార్య పిల్లలు క్షేమంగా
ఉన్నాము. అత్తగారికి మా
పాదాభివందనములు..
ఇట్లు ఆశీర్వదించి
మీ బావగారు అని కొట్టి నట్లు మూడు ముక్కలే ఉండేవి..
ఇన్లాండ్ ఐతే మా అత్తొ మా పిన్నో రాసేవాళ్ళు...దాంట్లో కూడా షరా మాములే..కాకపోతే కొంచెం ఎక్కువ చదవడానికి ఉండేది మా అత్త ప్రతి ఏడూ లాగే రాసేది వదిన నాకోసం కూడా ఏభై కాయలు ఆవకాయ పెట్టు. దాంట్లో పాతిక కాయలు పచ్చి ఆవకాయ ముక్కలు, పాతిక ఎండు ఆవకాయ ముక్కలు చాల్లే..ఒక పది కాయలు మాత్రం మాగాయి పచ్చడి పెట్టు....చింత పండు ఐదు కేజీలు పిక్క తీసి ఉంచండి. వదిన...కుంకుడికాయలు కూడా ఒక ఐదు కేజీలు చాలు...ఇలా అన్ని బయటకు చదువుకొని కడుపు ఉబ్బ నవ్వే వాళ్ళం.
ఎందుకంటే చింతపండు పిక్క తియ్యడం మా పనే కనుక ...రాబోయే భూకంపం ఉత్తరం ధర్మాన మొదటే తెలిసేది.
envelope ఐతే మా అక్క కోసం మా బావ రాసేవాడు..
ప్రేమ లేఖ కానీ ప్రేమ లేఖ.. ఏడిపించి ఏడిపించి చదివేసి ఇచ్చేదాన్ని..
ఎదురు చూసిన ఉత్తరం లేట్ గా వస్తే ఉత్తరం పైన స్టాంప్ మీద date చూసి పోస్ట్ మాస్టర్ తో తగువులు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు..అంత ఎదురు చూసే వాళ్ళం మరి.
గుండెలో దాచుకున్న బాధల్ని, సంతోషాల్ని ఎక్కువుగా చెప్పుకుందికి అవకాశం లేక నాలుగు అక్షర ముక్కల్లో ఉత్తరాల పేరిట తెలియ పరిచేవారు...
అందుకే కలసినపుడు చెప్పుకుందికి బోలెడన్ని విశేషాలు, ఊసులు ఇంకా మిగిలిపోయేవి..ఇప్పటి లాగా ఇన్ని సదుపాయాలు లేకపోవడం వల్ల ఒక ఊరునుండి ఇంకో ఊరికి ప్రయాణాలు కూడా కష్టమే అందుకే ఎక్కడికైనా వెళ్లినపుడే అవకాశం ఉన్నన్ని రోజులు ఉండిపోయేవారు ..
అందుకే కలసినపుడు మాట్లాడుకుందికి మాటలు, ఎక్కువ రోజులు కలసి ఉండడం వల్ల అభిమానాలు, ప్రేమలు కూడా ఎక్కువగానే ఉండేవి..ఒకరితో ఒకరు adjust అవ్వడం కూడా బాగా అలవాటయ్యేది.
ఇప్పుడు టెక్నాలజీ బాగా develop అవ్వడం మనుషులకు చాలా వరకు మేలు జరిగిన నిత్య జీవితంలో చిన్న చిన్న ఆనందాలు మాత్రం మిస్ అవుతున్నాము అన్న మాట నిజం.
what,s app, Face book, Skype, video chatting ల వల్ల మన వాళ్ళ యోగ క్షేమలు ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగిన...కలసుకున్నపుడు పూర్వ కాలంలో లాగ ఉండే ఆత్రుత, అభిమానం కాన రాటంలేదు..అని నా అభిప్రాయం అనుకోండి..
అప్పట్లో ఊసిపోక పోయిన లేద మనుషులు జ్ఞ్యాపకం వచ్చిన పదే పదే వాళ్ళ ఉత్తరాలు చదువుకొని మురిపోయేవారు..
ఏది ఏమైనా ఎవరో మహానుభావుడు అన్నట్టు పోయినోళ్లు
అందరూ మంచోళ్ళు....
గడచిన రోజులు అన్ని మధురానుభూతులు..అని నిట్టూర్చడం తప్ప చేయ గలిగింది ఏమీలేదు...
🤔
రేణుక సుసర్ల
Art Work By : Sadasivuni Madhurasree

వేదన

యదలోతుల్లో......
ఆలోచనల అగ్నిగుండం.....
చేసిన బాసలు మరచిన వాడు,
చేరువులో లేడు.
కథలెన్నో చెప్పాడు, 
కలలు మాత్రమే మిగిల్చాడు.
నేనె తన ఊపిరి అన్నాడు,
నా శ్వాసనే ఆపేశాడు.
తన ఊహల పూదోటలో,
విర బూసిన పూవు అన్నాడు.
తావి లేని పూవుగా మిగిల్చాడు.
హృదయం బరువెక్కి,
తడిసిన మేఘాల వలే,
తలుపు తడితే,
కనురెప్పలు కురియమని
దారీయగా..
కంటి పాపే,
ఆకాశమై వర్షించింది.
మృదువైన నీ చేయి,
నా భుజం తట్టగా,
నీకు నేనున్నానని,
నీ మూగ కళ్ళు ,
మవునంగా చెప్పాయి..
కోరుకున్న వాడు కూల దోస్తే,
ఆదుకున్న వాడు,
ఆత్మీయుడయ్యాడు.
రేణుక సుసర్ల

గరం గరం

ఎండాకాలం అంటే
అందరికి పరేషాన్
కూర్చుందా మంటే
కుర్సీ గరం
ఆనుకుందాం మంటే 
తలుపులు గరం
బయటకెళ్తే నగరం
అంత గరం గరం
శ్వాస తీసుకుందామంటే
పీల్చే గాలి గరం
శ్వాస తీయకపోతే
మనిషి బతుకే ఘోరం
ఎండ ధాటికి
శాంతి మంతుల
దిమాక్ కూడా గరం.
ఆడవాళ్ళ బాధ
ఇంకా ఘోరం
మేకప్ వేసుకుంటే
చెమటకి పరేషాన్
వేసుకోకపోతే
తరుగుతుంది వాళ్ల షాన్.
తాగుతున్నారు
చల్లని పానీయాలు...
గొంతులో దిగుతూ 

ఉంటే గమ్మత్తు
ఐ పోయాక
వదులుతుంది మత్తు...
ఎండ నుండి కాపడుకుందుకి
పడుతున్నారు పాట్లు
అయిన
తప్పటం లేదు ఇక్కట్లు.

రేణుక సుసర్ల

కాగితం

అందరికి
నేస్తాన్ని నేను...
ముత్యమంత
మనసున్న దాన్ని....
నా ముందు అందరూ.....
మనసుతో మాట్లాడతారు.
మనసుని ,
నామీద అక్షర రూపంలో, పెడతారు...
మనిషికి
పుట్టిన దగ్గర నుండి,
కట్ట కాలే దాకా,
నేనే సాక్షిని...
ముక్కోటి దేవతల,
సాక్షిగా జరిగిన ,
పెళ్లి కి కూడా ,
నేనే మొదటి సాక్షిని.....
నేను లేనిదే,
మనిషికి విలువేలేదు.....
మనిషి ఒదిగేది ,
నా ఎదుటే....
ఎదిగేది నా ఎదుటే....
పయనించేది నా తోటే....
జీవించేది నా తోటే...
గమ్యము నేనే
ఆలోచన నేనే...
ఐశ్వర్యము నేనే..
పరువు ,
ప్రతిష్ట..నేనే.....
పట్ట భద్రుడిగ గుర్తింపు
తెచ్చింది నేనే...
పామరుడిగా
తెలియ పరిచేది నేనే.....
ఇందరికి ఇన్నిటికి
మూలమైన
నన్ను మాత్రం
చులకన గానే ....
చూస్తాడు మనిషి.....
తూన లాడతాడు మనిషి....
నేనే ....కాగితాన్ని😉
మీ అందరి జీవితాల్లో
నలిగి కృశించిన కాగితాన్ని🙄
రేణుక సుసర్ల

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...